

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP 2026) అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేస్తారు. గ్రామ జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, వ్యవసాయం, భూమిలేని కూలీలు, బలహీన వర్గాలు, ఆస్తులు, పశుసంపద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికతో పాటు రాబోయే మూడు నుంచి ఐదేళ్లకు సంబంధించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి. పారదర్శకత కోసం ప్రతి పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్, డాష్‌బోర్డు ఏర్పాటు చేసి, గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపరచాలి. అభివృద్ధి పనుల పురోగతిని ప్రతి నెలా నవీకరించాలి. పంచాయతీలు కోరిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అందించాలి. సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం సమర్పించినా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 135 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రణాళికల అమలును సమీక్షిస్తారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంలో భాగంగా ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!