

విడుదల తేదీ: ఆగస్టు 07, 2026
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్ తదితరులు
దర్శకుడు: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి యెడుగూరు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి
సంగీత దర్శకుడు: ఎస్. తమన్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
రాయలసీమలోని పెనుకొండకు చెందిన జానపద కళాకారుడు కనకరాజు (వరుణ్ తేజ్) కియా ప్లాంట్‌లో పనిచేసే, కె-పాప్ అభిమానిని ఛైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు. ఇద్దరి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఓ కొరియన్ యువకుడి ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? ఎందుకు కనకరాజునే ఎంచుకుంది? ఆ సమస్య నుంచి బయటపడేందుకు కనకరాజు, ఛైత్ర, అతని స్నేహితుడు కిష్టప్ప ఏం చేశారు? చివరకు కనకరాజు ఆ శాపం నుంచి విముక్తి పొందాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
మేర్లపాక గాంధీ హారర్ కామెడీ జానర్‌ను వినోదాత్మకంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. కథతో పాటు హాస్యాన్ని సమాంతరంగా నడిపించిన స్క్రీన్‌ప్లే సినిమా ప్రధాన బలం. వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో చక్కటి నటన కనబరిచారు. ముఖ్యంగా సత్యతో కలిసి వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సత్య అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. రితికా నాయక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్, ఇతర నటీనటులు కూడా మంచి సహకారం అందించారు.
వినోదానికి పెద్దపీట వేయడంతో కొన్ని చోట్ల లాజిక్‌ను పూర్తిగా పక్కన పెట్టిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. చివరి భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా అనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని హింసాత్మక సన్నివేశాలను మరింత తగ్గించి ఉంటే బాగుండేది.
ఎస్. తమన్ అందించిన నేపథ్య సంగీతం హారర్, కామెడీ సన్నివేశాలకు మంచి బలం చేకూర్చింది. పాటలు కూడా కథకు అనుగుణంగా ఉన్నాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొరియా నేపథ్యంలోని విజువల్స్ అందంగా చిత్రీకరించారు. ఎడిటర్ సత్య జి కథనం ఎక్కడా నెమ్మదించకుండా చక్కగా కుదించారు. రచయిత-దర్శకుడు మేర్లపాక గాంధీ వినోదాన్ని ప్రధానంగా తీసుకుని ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంలో విజయవంతమయ్యారు.
'కొరియన్ కనకరాజు' ఆద్యంతం నవ్వులు పంచే హారర్ కామెడీ ఎంటర్టైనర్. ఇండో-కొరియన్ నేపథ్యం, వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం, సత్య అద్భుతమైన కామెడీ టైమింగ్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్, సీజీఐ కొంత నిరాశపరిచినా, కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించదగిన కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!