

అంతరిక్షం పరిశోధనలకు కీలక కేంద్రంగా మారుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాయని, రాబోయే పదేళ్లలో వాటి సంఖ్య 10 లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. కాస్మోసర్వ్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాలను కక్ష్యల నుంచి తొలగించి తిరిగి తీసుకురావడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ఈ తరహా ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు.
కాస్మోసర్వ్ సంస్థ అంతరిక్షం నుంచి వ్యర్థాలను తిరిగి తీసుకొచ్చే సాంకేతికతను అభివృద్ధి చేస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతరిక్ష రంగ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సంస్థలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పేస్‌టెక్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఫ్యూచర్ సిటీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. తద్వారా అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!