

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇవ్వనుంది. ముఖ్యంగా బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతుండటంతో మెమొరీ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు దాదాపు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో మెమొరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. దీంతో మొబైల్ తయారీ సంస్థల ఉత్పత్తి వ్యయం పెరిగి, ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. 2027లోనూ మెమొరీ చిప్‌లకు డిమాండ్ కొనసాగుతుందని, మొత్తం డిమాండ్‌లో ఏఐ కంపెనీల వాటా 60 శాతానికి చేరవచ్చని జెఫ్రీస్ నివేదిక వెల్లడించింది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల తయారీపై ఈ పరిణామాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. 2025లో 20 డాలర్లుగా ఉన్న మెమొరీ చిప్‌ల ధరలు ప్రస్తుతం 60 నుంచి 65 డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయంలో మెమొరీ చిప్‌ల వాటా సుమారు 60 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా బడ్జెట్ ఫోన్ల ధరలు దాదాపు 30 శాతం పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు మొబైల్ కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఫలితంగా వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం లేదా తక్కువ ధరకు లభించే రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని జెఫ్రీస్ అభిప్రాయపడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!