

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెట్టి తమవారికి సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. 67వ రోజు రాంప్రసాద్, దేబ్జానీ, సుధీర్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌లో సందడి చేశారు. ముందుగా రాంప్రసాద్ తల్లి, కుమార్తె ఉజ్వల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. లోపలికి వచ్చిన వెంటనే రాంప్రసాద్ తల్లి నేరుగా కిచెన్‌లోకి వెళ్లి, తన కొడుక్కి ఇష్టమైన విధంగా టీ తయారుచేసి తీసుకొచ్చి ఇచ్చారు. తల్లితో మాట్లాడుతున్న సమయంలోనే కుమార్తె ఉజ్వల కూడా వచ్చి నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించింది. దీంతో రాంప్రసాద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సందర్భంగా హౌస్ బయట తనకు లభిస్తున్న మద్దతు గురించి రాంప్రసాద్ తల్లి వివరించారు. చుట్టుపక్కల ఫ్లాట్లలో నివసించే వారు కూడా రాంప్రసాద్ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనలో ఉన్న లోపాలు ఏమిటని రాంప్రసాద్ తల్లిని అడగగా, ఇతరుల తప్పులను ఎత్తిచూపలేకపోవడమే అతడి బలహీనత అని ఆమె చెప్పారు. దీనికి స్పందించిన రాంప్రసాద్.. ఇతరుల తప్పులను బయటపెట్టడం తనకు చేతకాదని, కొన్నిసార్లు వారి తప్పులను కూడా తనపై వేసుకుంటానని అన్నాడు. అవును, అది నీకు చేతకాదులే అంటూ తల్లి కూడా అంగీకరించారు. తల్లీకొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణ హౌస్‌లో ఆసక్తికరంగా సాగింది.
ఆ తర్వాత దేబ్జానీ తల్లిదండ్రులు హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్లందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా నరేష్‌తో దేబ్జానీ తండ్రి చేసిన సరదా సంభాషణ నవ్వులు పూయించింది. నరేష్‌ను అల్లుడుగారు అంటూ సరదాగా సంబోధించడంతో హౌస్‌లో సందడి నెలకొంది. అనంతరం హౌస్‌లోకి వచ్చిన సుధీర్ తల్లి తన కుమారుడి కాలికి గాయం ఉండటాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను ఇతర ఇంటి సభ్యులు ఓదార్చుతూ గాయం త్వరలోనే తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు. తన కుమారుడు ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వంగా ఉందని, ఎక్కడికి వెళ్లినా సుధీర్ గురించి గర్వంగా చెప్పుకుంటానని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇలా కుటుంబ సభ్యుల రాకతో 67వ రోజు ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, నవ్వులు కలగలిసిన మధుర క్షణాలు చోటుచేసుకున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!