

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ టాస్క్‌లు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో జబర్దస్త్ నరేష్ తన ఆటతీరు, వినోదం, ప్రవర్తనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతర కంటెస్టెంట్లతో అనవసర గొడవలకు దూరంగా ఉంటూ, నామినేషన్ల సమయంలో స్పష్టమైన కారణాలు చెప్పడం ద్వారా నాగార్జున నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకున్నాడు. అయితే తాజాగా జరిగిన ఫ్యామిలీ వీక్ టాస్క్‌లో నరేష్ సంచాలకుడిగా వ్యవహరించడంతో వివాదం మొదలైంది. ముకేష్, అమన్, వర్షిణి, రామకృష్ణలకు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించేందుకు బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు.
ఈ టాస్క్‌లో హౌస్ ఆకారంలో ఉన్న ఇటుకలను ఒకదానిపై మరొకటి పేర్చి, ఐదు సెకన్ల పాటు అవి కిందపడకుండా ఉంచాల్సి ఉంటుంది. ముకేష్ ఇటుకలను సరిగానే పేర్చినప్పటికీ, నరేష్ నాలుగో నంబర్ లెక్కిస్తున్న సమయంలోనే అవి కిందపడినట్లు కనిపించింది. అయితే ఐదు నంబర్లు పూర్తయ్యాకే ఇటుకలు పడిపోయాయని ముకేష్ వాదించాడు. మరోవైపు, నాలుగో నంబర్ దగ్గరే అవి కూలిపోయాయని కొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన నరేష్.. తాను ఐదు అని చెప్పిన తర్వాతే ఇటుకలు కిందపడ్డాయని స్పష్టం చేశాడు. ఒకవేళ తన నిర్ణయం తప్పని తేలితే నాగార్జున ఇచ్చే తీర్పును అంగీకరిస్తానని చెప్పాడు. ఇప్పటివరకు నరేష్‌ను ప్రశంసిస్తూ వచ్చిన నాగార్జున ఈ వివాదంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీకెండ్ ఎపిసోడ్‌లో నరేష్‌కు ప్రశంసలు దక్కుతాయా? లేక ఈ టాస్క్ విషయంలో క్లాస్ పడుతుందా? అనేది చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!