

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 61వ రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్ కొత్త కెప్టెన్‌గా వంశీ ఎంపికయ్యాడు. కెప్టెన్సీ పోటీలో త్రిగుణ్, శ్వేత, దేబ్జానీ, వంశీ పాల్గొన్నారు. ఈ నలుగురిలో వంశీకి ఎక్కువ మంది సభ్యుల మద్దతు లభించడంతో విజయం సాధించి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో హౌస్‌లో మరో వారం కెప్టెన్సీ పగ్గాలు వంశీ చేతికి వచ్చాయి.
మరోవైపు అంతకుముందు ఆహారం విషయంలో త్రిగుణ్, వర్షిణి మధ్య వివాదం జరిగింది. వర్షిణి ఆహారాన్ని వృథా చేస్తోందని భావించిన త్రిగుణ్.. ఆమెకు టీ ఇవ్వకుండా శిక్ష విధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వర్షిణికి మద్దతుగా ముకేశ్ రంగంలోకి దిగడంతో త్రిగుణ్, ముకేశ్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాలతో హౌస్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా, గతంలో జరిగిన ‘రివేంజ్ అండ్ రివార్డ్’ టాస్క్‌లో రివేంజ్‌కు గురైన సభ్యులకు కూడా కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కల్పించేందుకు బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఆర్కే, అమన్, వర్షిణి, ముకేశ్ ఈ అవకాశాన్ని కోల్పోయిన వారిలో ఉన్నారు. ఈసారి ప్రత్యేకంగా జంటలుగా టాస్క్ నిర్వహించారు. ఆర్కే, అమన్ ఒక జట్టుగా, ముకేశ్, వర్షిణి మరో జట్టుగా ఏర్పడ్డారు. విజయం సాధించిన జట్టులోని ఒక్కరికే కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించారు.
ఈ టాస్క్‌లో ఒక సభ్యుడు స్టాండ్‌ను బ్యాలెన్స్ చేస్తుండగా, మరో సభ్యుడు దానిపై ఇటుకలతో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్మాణాన్ని పూర్తి చేసిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఈ క్రమంలో ముకేశ్, వర్షిణి ముందుగా టాస్క్‌ను పూర్తి చేశారు. అయితే వారు స్టాండ్‌ను ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేదని, ఇల్లు త్వరగా కూలిపోయిందని ఇతర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. టాస్క్ సంచాలకుడిగా వ్యవహరించిన నరేశ్ మాత్రం ముకేశ్, వర్షిణి జట్టునే విజేతగా ప్రకటించారు.
విజేత జట్టులోని ఒక్కరికే కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉండటంతో వర్షిణి తన అవకాశాన్ని త్యాగం చేసి ముకేశ్‌కు ఇచ్చింది. మరోవైపు తమకు అన్యాయం జరిగిందని భావించిన ఆర్కే, అమన్ నరేశ్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నరేశ్, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన నిర్ణయంలో తప్పు ఉంటే శనివారం తానే శిక్ష అనుభవిస్తానంటూ నరేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా కెప్టెన్సీ పోటీ, ఆహార వివాదం, కుటుంబ సభ్యులను కలుసుకునే టాస్క్ చుట్టూ 61వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!