

జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. వీరి నేతృత్వంలో భారత అథ్లెట్ల బృందం క్రీడాకారుల పరేడ్‌లో పాల్గొంది. ఈసారి ఆసియా క్రీడల కోసం భారత్ 503 మంది క్రీడాకారులతో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దించింది. మొత్తం 36 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల కబడ్డీ జట్టులో సభ్యుడైన పవన్ సెహ్రావత్.. మను భాకర్‌తో కలిసి భారత బృందానికి నాయకత్వం వహించాడు.
భారత పతాకధారిగా ఎంపిక కావడంపై మను భాకర్ ఆనందం, గర్వం వ్యక్తం చేసింది. షూటింగ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఒకరోజు ఈ స్థాయికి చేరుకుంటానని తాను ఊహించలేదని, పతాకధారిగా ఎంపికైన విషయం తెలియగానే తన ప్రయాణం మొత్తం కళ్ల ముందు మెదిలిందని తెలిపింది. ఈ గౌరవం తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన అనుభూతి అని పేర్కొంది. దేశానికి పతాకధారిగా వ్యవహరించే అవకాశం రావడం గర్వంగా, గౌరవంగా, ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మను భాకర్ కృతజ్ఞతలు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!