

వన్డే ప్రపంచకప్ టికెట్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దక్షిణాఫ్రికాలోని వాండరర్స్ మైదానం సీటింగ్ సామర్థ్యం కేవలం 34 వేల మంది మాత్రమే కాగా, అక్కడ జరగనున్న మ్యాచ్ను వీక్షించేందుకు ఏకంగా 84 లక్షల మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు కూడా దాదాపు 80 లక్షల టికెట్ అభ్యర్థనలు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ స్పందన నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
మొత్తం 14 జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీకి 193 దేశాల నుంచి 30 లక్షల మందికి పైగా అభిమానులు 12 కోట్లకు పైగా టికెట్ అభ్యర్థనలు సమర్పించినట్లు సమాచారం. టికెట్ బ్యాలెట్ ప్రక్రియ నవంబర్ 21 వరకు కొనసాగనుంది. ఈ వన్డే ప్రపంచకప్ 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అభిమానుల నుంచి లభిస్తున్న ఈ స్పందన టోర్నీపై నెలకొన్న భారీ ఆసక్తిని తెలియజేస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!