

ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న టీమ్‌ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటివరకు భారత్ 45 వన్డేలు ఆడింది. వీటిలో 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 26 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టైగా ముగియగా, మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2009 మార్చి 8న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసి అత్యధిక స్కోరు నమోదు చేసింది. పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద విజయం 2019 జనవరి 26న మౌంట్ మాంగనుయ్‌లో దక్కింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. 2019 జనవరి 23న నేపియర్‌లో 156 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి ఎనిమిది వికెట్ల విజయాన్ని అందుకుంది.
న్యూజిలాండ్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ తెందూల్కర్ నిలిచాడు. 18 మ్యాచ్‌ల్లో ఆయన 652 పరుగులు సాధించాడు. 2009 మార్చి 8న క్రైస్ట్‌చర్చ్‌లో 133 బంతుల్లో అజేయంగా 164 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 12 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే 16 సిక్సర్లతోనూ రికార్డు నెలకొల్పాడు. ఎంఎస్ ధోనీ 13 మ్యాచ్‌ల్లో ఐదు అర్ధసెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో జవగళ్ శ్రీనాథ్ 18 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే 1994లో వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 5/33తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ఇక 2009 మార్చి 11న హామిల్టన్‌లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ జోడీ తొలి వికెట్‌కు 201 పరుగులు జోడించి భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!