

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో జపాన్‌ను 4-1తో ఓడించి వరుసగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో జపాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో నిమిషంలో మట్సుమోటో గోల్ చేయడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత్ స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే మూడో క్వార్టర్ చివర్లో 42వ నిమిషంలో శిలానంద్ లక్రా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది.
ఈ గోల్‌తో ఊపుమీదకు వచ్చిన భారత ఆటగాళ్లు చివరి క్వార్టర్‌లో దూకుడుగా ఆడారు. 48వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా.. 53వ నిమిషంలో జుగ్‌రాజ్, 54వ నిమిషంలో వివేక్ సాగర్ వరుసగా గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేశారు. చివరి ఆరు నిమిషాల్లో జపాన్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా భారత రక్షణ విభాగం సమర్థంగా అడ్డుకుంది. దీంతో భారత్ 4-1తో విజయం సాధించి వరుసగా మూడోసారి, మొత్తంగా ఆరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. గతంలో 2023, 2024తో పాటు 2011, 2016, 2018లోనూ భారత్ విజేతగా నిలిచింది. మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోరులో మలేసియా 5-2తో దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!