

కాక్రోచ్ జనతా పార్టీ (CJP), ఆ సంస్థకు మద్దతు ఇస్తున్న వ్యక్తులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌లో అశాంతిని సృష్టించేందుకు విదేశీ ఎన్జీవోలు, భారత్ వ్యతిరేక నెట్‌వర్క్‌ల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని ఆరోపించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు అమెరికాలోని దాతల నుంచి, ఆ సంస్థ వ్యూహకర్త ఆశుతోష్ రంకాకు పాకిస్థాన్ రాజకీయ నాయకుల నుంచి ఆర్థిక సహకారం అందుతున్నట్లు అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. విదేశీ నిధులతో పనిచేసే ఎన్జీవోలు, డీప్ స్టేట్ ప్రతినిధులు, భారత్ వ్యతిరేక శక్తులు కలిసి దేశంలో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. CJP ఇటీవల నిర్వహించిన నిరసనలపైనా బీజేపీ విమర్శలు గుప్పించింది. పండుగల సమయంలో ఢిల్లీలో గందరగోళం సృష్టించడమే నిరసనల ఉద్దేశమని బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ ఏ. సిన్హా ఆరోపించారు. కాంగ్రెస్ కూడా న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు.
మరోవైపు, నిషేధాజ్ఞల ఉల్లంఘన, అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడం, అక్రమంగా ఇతరుల ఆస్తుల్లోకి చొరబడటం వంటి ఆరోపణలపై CJP ప్రతినిధి సౌరభ్ దాస్, వ్యూహకర్త ఆశుతోష్ రంకాలకు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 10న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల పీస్ బాండ్ తీసుకుని విడుదల చేశారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమని వారు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే అక్టోబర్ 13న బాండ్ నిబంధనలను ఉల్లంఘించి, పోలీసుల బారికేడ్లను దాటి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించినట్లు ఆరోపించారు. కేంద్రం చేస్తున్న విదేశీ నిధుల ఆరోపణలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు ఖండించారు. బెంగళూరులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు IB, R&AW పనితీరుపైనా ప్రశ్నలు సంధించారు. దీంతో CJP విదేశీ నిధుల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ వివాదానికి దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!