

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి తర్వాత వైట్‌హౌస్‌లో రాజకీయ విభేదాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. సెనెట్, ప్రతినిధుల సభ రెండింటినీ డెమోక్రాట్లు కైవసం చేసుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించినట్లు సమాచారం. ఇరాన్‌తో యుద్ధం చేయాలన్న నిర్ణయం పార్టీకి నష్టం కలిగించిందని ఆయన ఎక్స్‌లో చేసిన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు. ఓటింగ్ శాతం తగ్గడం వల్ల కాకుండా, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతిచ్చిన పలువురు ఓటర్లు ఈసారి అసంతృప్తితో డెమోక్రాట్ల వైపు మొగ్గుచూపారని తెలిపారు. ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, ఇజ్రాయెల్‌తో అమెరికా దౌత్య సంబంధాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి పార్టీ ఓటమికి ప్రధాన కారణాలని విశ్లేషించారు.
అమెరికా విదేశాంగ విధానాన్ని ఇజ్రాయెల్ ప్రభావితం చేయకూడదని, అంతులేని విదేశీ యుద్ధాల్లో దేశం జోక్యం చేసుకోవడం సరికాదని వాన్స్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన సూచనలన్నీ తప్పేనని వాన్స్ ప్రైవేట్ సంభాషణల్లో వ్యాఖ్యానించినట్లు యాక్సియోస్ కథనం వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు 2028 అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ విధానాల నుంచి తనను తాను వేరు చేసుకునే వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ట్రంప్ మూడోసారి ఎన్నికల్లో పోటీ చేయలేరు. దీంతో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష బరిలో నిలిచే అవకాశాలున్న వాన్స్.. ఇరాన్ యుద్ధాన్ని ముగించడం, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని తగ్గించడం, అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలను పునఃసమీక్షించడం వంటి అంశాలను తన ప్రాధాన్యాలుగా ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!