

2026 ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. సెయిలింగ్ పురుషుల స్కిఫ్ విభాగంలో మను ఫ్రాన్సిస్-ప్రిన్స్ నోబెల్ జోడీ రజత పతకం సాధించింది. 23 పాయింట్లతో హాంకాంగ్‌తో సమంగా నిలిచినప్పటికీ.. ఎక్కువ రేసుల్లో మెరుగైన స్థానాలు సాధించిన భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో రేసులో అగ్రస్థానంలో నిలిచిన భారత ద్వయం.. ఒకటి, ఐదు, తొమ్మిదో రేసుల్లో రెండో స్థానాల్లో నిలిచింది. చైనా స్వర్ణం సాధించింది. మహిళల స్కిఫ్‌లో హర్షిత తోమర్-శీతల్ వర్మ జోడీ 24 పాయింట్లతో కాంస్యం గెలిచింది. ప్రిన్స్ నోబెల్‌కు ఈ పతకం ఎంతో ప్రత్యేకం. జాలరిగా పనిచేసిన అతడి తండ్రి 2018 కేరళం వరదల్లో మరణించారు. 2009లో సెయిలింగ్ ప్రారంభించిన ప్రిన్స్.. తన వరసకు సోదరుడైన మను ఫ్రాన్సిస్‌తో దాదాపు పదేళ్లుగా కలిసి పోటీపడుతున్నాడు. 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఈ జోడీ కాంస్యం సాధించింది.
స్క్వాష్‌లోనూ భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. మహిళల జట్టు హాంకాంగ్ చేతిలో 1-2తో, పురుషుల జట్టు మలేసియా చేతిలో ఓటమిపాలై సెమీఫైనల్స్‌తోనే పోరాటాన్ని ముగించాయి. దీంతో స్క్వాష్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. సింగిల్స్‌లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ రజతాలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప-వేలవన్ సెంథిల్‌కుమార్ కాంస్యం గెలిచారు. సెపక్‌తక్రా పురుషుల క్వాడ్రాంట్‌లో మయన్మార్‌పై 2-1తో విజయం సాధించిన భారత్ గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరింది. షూటింగ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో అనీశ్ బన్వాలా 11 హిట్స్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. టెన్నిస్‌లో మాత్రం భారత్ పతకం లేకుండానే ముగించింది. క్వార్టర్‌ఫైనల్లో సుమిత్ నగాల్ 4-6, 4-6తో చైనాకు చెందిన యిబింగ్ వు చేతిలో ఓడటంతో.. 1986 తర్వాత తొలిసారి ఆసియా క్రీడల్లో భారత టెన్నిస్ బృందం పతకం సాధించలేకపోయింది. ఇక మహిళల హాకీ ఫైనల్లో శుక్రవారం చైనాతో భారత్ తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో 1982 తర్వాత తొలిసారి స్వర్ణం సాధించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!