

జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. మంగళవారం జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో కెప్టెన్ అన్మోల్ ఎక్కా రెండు గోల్స్‌తో మెరవడంతో భారత్ 7-3తో కొరియాపై ఘన విజయం సాధించింది. అన్మోల్‌తో పాటు లవ్‌నూర్ సింగ్, అజీత్ సింగ్, ప్రభ్‌దీప్ సింగ్, గురుసేవక్ సింగ్, ఆర్యన్ గోల్స్ సాధించారు. మూడు క్వార్టర్ల వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా స్కోరు 3-3గా నిలిచింది. అయితే చివరి క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు దాడులను మరింత తీవ్రతరం చేసి నాలుగు గోల్స్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు సాధించిన భారత్ పూల్-ఎలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం చైనీస్ తైపీపై విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు మహిళల టోర్నీలో భారత అమ్మాయిల జట్టు కూడా సత్తా చాటింది. ఎలైట్ పూల్ మ్యాచ్‌లో జపాన్‌ను 7-0తో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. కృష్ణ శర్మ, సుప్రియ, పూర్ణిమ యాదవ్, గీత యాదవ్, సనిక భారత్ తరఫున గోల్స్ సాధించారు. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ క్వార్టర్స్‌కు చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!