

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్‌లో మ్యాచ్ కోసం వెళ్లిన ఆ జట్టు ఆటగాళ్లను అక్రమ వలసదారులుగా భావించిన యాంటీ-ఇమిగ్రెంట్ ఉద్యమకారులు హోటల్ ముందు నిరసనకు దిగారు. ఆటగాళ్లు బస్సు దిగి హోటల్‌లోకి వెళ్తుండగా సుమారు 40 మంది అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే స్థానిక అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, వారు క్రికెట్ మ్యాచ్ కోసం వచ్చిన పాకిస్థాన్ అండర్-19 జట్టు ఆటగాళ్లని వివరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
స్థానిక కౌన్సిలర్ జార్జ్ మాడ్గివిక్ ముందుగా పాకిస్థాన్ జట్టు కోచ్‌తో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిరసనకారులతో చర్చించి, వారు అక్రమ వలసదారులు కాదని, క్రికెటర్లని నచ్చజెప్పారు. కొన్ని నిమిషాల తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆన్‌లైన్‌లో ఓ ఫొటోకు తప్పుడు సమాచారం జతచేసి ప్రచారం చేయడం వల్లే అపోహ ఏర్పడినట్లు కౌన్సిలర్ తెలిపారు. పోర్ట్స్‌మౌత్ నార్త్ ఎంపీ అమందా మార్టిన్ కూడా తప్పుడు సమాచార వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసి, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!