

యూఎస్ ఓపెన్ 2026లో సంచలనాలకు కొదవ లేకుండా పోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లు ముందుగానే ఇంటిముఖం పట్టగా.. కొత్త తరం ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్నారు. అయితే, టోర్నీ షెడ్యూలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా నైట్ సెషన్‌లో మ్యాచ్‌లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమవడం, తెల్లవారుజాము వరకు కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. టెన్నిస్ దిగ్గజం మార్టినా నవత్రిలోవా కూడా ఈ విధానంపై అసహనం వ్యక్తం చేశారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఆమె మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్‌లో ఐదు సెట్ల మ్యాచ్‌లు ఉండటంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. కార్లోస్ అల్కరాస్, బెన్ షెల్టన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభమై దాదాపు నాలుగున్నర గంటలపాటు సాగి తెల్లవారుజామున 3.34 గంటలకు ముగిసింది. ఆ మ్యాచ్‌ను తాను మేల్కొని చూశానని, అనంతరం తన క్వార్టర్ ఫైనల్ ఆడాల్సి వచ్చిందని అలెగ్జాండర్ జ్వెరెవ్ వెల్లడించాడు.
నైట్ సెషన్ షెడ్యూలింగ్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని నవత్రిలోవా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రాత్రి 10 గంటలకు మహిళల మ్యాచ్‌ను ప్రారంభించి, ఆ తర్వాత ఐదు సెట్ల పురుషుల మ్యాచ్‌ను అర్ధరాత్రి సమయంలో మొదలుపెట్టడం ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎస్ ఓపెన్‌లో కీలక మ్యాచ్‌లకు వేదికైన ఆర్థర్ యాషె స్టేడియంలో నైట్ సెషన్లకు భారీ ఆదరణ ఉంటుంది. ప్రైమ్‌టైమ్ కావడంతో ప్రేక్షకులతో పాటు టీవీ వ్యూయర్‌షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమైతే సుదీర్ఘమైన ఐదు సెట్ల పోరులు తెల్లవారుజాము వరకు సాగుతున్నాయి. ఒకే సెషన్‌లో పురుషుల సింగిల్స్‌కు రెండు మ్యాచ్‌లు కేటాయించినప్పుడు రెండో పోరు అర్ధరాత్రి సమయంలో ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సింగిల్స్ మ్యాచ్‌తో పాటు డబుల్స్ పోరును నిర్వహించడం వంటి షెడ్యూలింగ్ మార్పులను పరిశీలించాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!