

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జర్మనీకి చెందిన యోనె లి చేతిలో ఆమె పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింధు తొలి గేమ్‌ను 21-13తో గెలుచుకుంది. అయితే రెండో గేమ్‌లో 23-25తో ఓడిపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ 19-21తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు, భారత యువ షట్లర్ తన్వీ శర్మ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో జపాన్ క్రీడాకారిణి నత్సుకి నిదైరాపై 21-17, 16-21, 21-19తో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు లక్ష్యసేన్‌కు కూడా తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. చైనీస్ తైపీకి చెందిన చౌ తీన్ చెన్ చేతిలో 18-21, 21-13, 15-21తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే మరో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన అర్నాడ్ మెర్కల్‌ను 22-20, 21-19తో వరుస గేముల్లో ఓడించాడు. దీంతో డెన్మార్క్ ఓపెన్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!