

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఘనతను అందుకోవడానికి కోహ్లీకి కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 186 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా తన 13వ బంతికి 12వ పరుగు పూర్తి చేయడంతో ఈ చారిత్రక రికార్డును అందుకున్నాడు. దీంతో ఈడెన్ పార్క్‌లో అభిమానులు చప్పట్లతో కోహ్లీ ఘనతను అభినందించారు.

వన్డేల్లో మూడో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 13 వేల పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 12,662 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ స్థానంలో కోహ్లీ 61.55 సగటుతో, 95.4 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. అంతేకాకుండా 48 సెంచరీలు, 69 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక వన్డే క్రికెట్‌లో ఒక నిర్దిష్ట బ్యాటింగ్ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఓపెనర్‌గా సచిన్ 15,310 పరుగులు సాధించాడు. ప్రస్తుతం మూడో స్థానంలో 13 వేల పరుగులు పూర్తి చేసిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు చేరువయ్యే దిశగా సాగుతున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!