

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గురువారం 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్ మరో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. అండర్-19 క్రికెట్లో చిన్న బ్యాట్‌తో పరుగుల వరద పారించిన కుర్రాడు.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు, ట్రోఫీలు, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు అతడి ఖాతాలో చేరాయి. మరోవైపు ఫామ్ కోల్పోయిన సందర్భాలు, విమర్శలు, ఒత్తిళ్లు ఎదురైనా వాటిని అధిగమించి తిరిగి సత్తా చాటాడు. ఫిట్నెస్, క్రమశిక్షణ, దూకుడు, పరుగుల దాహంతో ఆధునిక క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న కోహ్లీ లక్ష్యాల్లో 2027 వన్డే ప్రపంచకప్, అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల మైలురాయి, మరిన్ని ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి.
ఢిల్లీ తరఫున 2006-07 రంజీ ట్రోఫీలో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన కోహ్లీ.. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 257 పరుగులు సాధించాడు. 2008-09 విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో 534 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అదే ఏడాది భారత అండర్-19 జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచకప్ అందించాడు. ఆ టోర్నీలో 235 పరుగులతో మూడో అత్యధిక రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి టెస్టుల్లోనూ తిరుగులేని బ్యాటర్‌గా ఎదిగాడు. భారత టెస్టు కెప్టెన్‌గా ఏడు డబుల్ సెంచరీలు సాధించిన ఘనత కోహ్లీ పేరిటే ఉంది. 68 టెస్టులకు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు. కెప్టెన్‌గా 20 సెంచరీలు సాధించడంతో పాటు స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లను గెలిపించాడు. విదేశీ గడ్డపైనా సత్తా చాటుతూ సేనా దేశాల్లో 12 టెస్టు సెంచరీలు, ఆస్ట్రేలియాలో ఏడు టెస్టు శతకాలు నమోదు చేశాడు.
వన్డే క్రికెట్లో కోహ్లీ సాధించిన విజయాలు అతడిని ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ల సరసన నిలబెట్టాయి. వన్డేల్లో 55 సెంచరీలు సాధించిన అతడు.. లక్ష్య ఛేదనలో పరుగుల వరద పారించడంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. విజయవంతమైన ఛేజింగ్‌లలో 25 సెంచరీలు సాధించడం అతడి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి నిదర్శనం. స్వదేశంలోనూ ఏడు వేలకుపైగా వన్డే పరుగులు చేసి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లోనూ కోహ్లీ ప్రదర్శన అద్భుతం. టీ20 ప్రపంచకప్‌లలో అజేయంగా నిలిచిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. 2019లో వెస్టిండీస్‌పై కేవలం 21 బంతుల్లోనే టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2016 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 47 బంతుల్లో సెంచరీ సాధించడం అతడి కెరీర్లో ప్రత్యేక ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కు పైగా పరుగులు సాధించిన ఘనత కూడా అతడి స్థిరమైన బ్యాటింగ్‌కు నిదర్శనం.
అంతర్జాతీయ క్రికెట్లోనూ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగింది. 2010 నుంచి 2019 వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 20,960 పరుగులు సాధించాడు. ఈ దశాబ్దంలో 69 సెంచరీలు, 98 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఐసీసీ టోర్నీల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను అందుకున్నాడు. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లు, 2023 వన్డే ప్రపంచకప్‌లలో ఈ ఘనత సాధించాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయాల్లో భాగమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులు, వన్డేలు కలిపి 12 సెంచరీలు సాధించడం అతడి విదేశీ ప్రదర్శనకు నిదర్శనం. ఇలా ఎన్నో మైలురాళ్లు, రికార్డులతో క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కింగ్ కోహ్లీకి 38వ పుట్టినరోజు మరో మధురమైన మైలురాయిగా నిలవనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!