

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంథ్రోపిక్ మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. క్లాడ్ హైకూ 5.5 పేరుతో విడుదలైన ఈ మోడల్‌ను వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ సేవల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సారాంశాల తయారీ, డేటాబేస్ ప్రశ్నలు, సమాచార వర్గీకరణ, లైవ్ కస్టమర్ సపోర్ట్ వంటి పనులను సమర్థంగా నిర్వహించగలదని పేర్కొంది. కోడింగ్ పనుల్లో ఓపస్ 5.5, సానెట్ 5.5 మోడళ్లతో కలిపి ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలు అందిస్తుందని వెల్లడించింది. నాలెడ్జ్ వర్క్, కంప్యూటర్ వినియోగం, ఏజెంటిక్ కోడింగ్, విజువల్ రీజనింగ్ వంటి పరీక్షల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచినట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారులు ఖర్చు, పనితీరు మధ్య సమతుల్యతను ఎంచుకునేలా అడ్జస్టబుల్ ఎఫర్ట్ సెట్టింగ్‌ను కూడా ఇందులో అందించింది.
ఈ మోడల్ ధరలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 0.10 డాలర్లు, ప్రతి మిలియన్ అవుట్‌పుట్ టోకెన్లకు 0.50 డాలర్లు వసూలు చేయనున్నట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. హైకూ 4.5 ధరలైన 1 డాలర్, 5 డాలర్లతో పోలిస్తే ఇవి టోకెన్ ధరల్లో సుమారు 90 శాతం తగ్గింపును సూచిస్తున్నాయి. అయితే, మోడల్‌ను నిర్వహించే మొత్తం ఖర్చు దాదాపు 75 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. హైకూ 4.5తో పోలిస్తే భద్రతా ప్రమాణాలు, ఏఐ అలైన్‌మెంట్‌లోనూ మెరుగుదలలు ఉన్నాయని తెలిపింది. హానికరమైన వినియోగానికి దారితీసే అభ్యర్థనలపై పరిమితులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. క్లాడ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ద్వారా ఈ మోడల్ అందుబాటులో ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!