

ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఫేబుల్ 5.1, మైథోస్ 5.1 పేర్లతో తీసుకొచ్చిన ఈ మోడళ్లు కోడింగ్, పరిశోధన, సైబర్ సెక్యూరిటీ, బయాలజీ వంటి అధునాతన రంగాలపై దృష్టి సారించాయి. ఫేబుల్ 5.1ను సాధారణ వినియోగానికి అందుబాటులోకి తీసుకురాగా.. మైథోస్ 5.1ను సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పనిచేసే ఎంపిక చేసిన నిపుణులు, సంస్థలకు మాత్రమే అందిస్తున్నారు. గత మోడల్ ఫేబుల్ 5తో పోలిస్తే కొత్త వెర్షన్ క్లిష్టమైన, ఎక్కువ సమయం పట్టే పనుల్లో మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది. సాధారణ వర్క్‌లోడ్లకు దాదాపు 25 శాతం, అత్యంత ఏజెంటిక్ వర్క్‌లోడ్లకు 45 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ప్రాసెస్ చేసిన సమాచారాన్ని మళ్లీ ఉపయోగించుకునే క్యాష్ రీడ్స్ ధరను 75 శాతం తగ్గించడంతో ఈ వ్యయ ప్రయోజనం సాధ్యమవుతుందని వివరించింది.
కొత్త మోడళ్ల సామర్థ్యాలను సాఫ్ట్‌వేర్, శాస్త్రీయ పరిశోధనల్లోనూ పరీక్షించినట్లు ఆంత్రోపిక్ వెల్లడించింది. ఏళ్లుగా పరిష్కారం కాని ఓ సాఫ్ట్‌వేర్ క్రాష్‌కు కారణమైన సమస్యను ఫేబుల్ 5.1 గుర్తించిందని సంస్థ తెలిపింది. అలాగే మైథోస్ 5.1 ప్రోటీన్ డిజైన్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిందని పేర్కొంది. 12 టార్గెట్లపై రూపొందించిన డిజైన్లలో దాదాపు సగం ఉపయోగకరమైన ప్రోటీన్ బైండర్లుగా నిర్ధారించబడినట్లు తెలిపింది. నాసా మ్యాజెలన్ మిషన్ డేటాను ఉపయోగించి శుక్ర గ్రహంలోని దాదాపు మూడో వంతు ప్రాంతానికి అధిక రిజల్యూషన్ ఎలివేషన్ మ్యాప్‌ను రూపొందించడంలోనూ ఫేబుల్ 5.1 పనిచేసిందని వెల్లడించింది. మరోవైపు సైబర్ సెక్యూరిటీ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు భద్రతా వ్యవస్థలను కూడా అప్‌డేట్ చేసింది. ఫేబుల్ 5.1లో అనవసరమైన జోక్యాలను తగ్గించే రక్షణ వ్యవస్థలను అమలు చేయగా.. మైథోస్ 5.1ను అధునాతన సామర్థ్యాల కారణంగా ప్రస్తుతం ఎంపిక చేసిన నిపుణులకే పరిమితం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!