

గూగుల్ ఎర్త్‌లో తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను విడుదలైన 24 గంటలు పూర్తికాకముందే గూగుల్ వెనక్కి తీసుకుంది. నానో బనానా 2 టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన "క్రియేట్ ఇమేజ్" ఫీచర్ ద్వారా వినియోగదారులు గూగుల్ ఎర్త్ ఉపగ్రహ, వైమానిక, 3డీ మ్యాప్ డేటాను ఉపయోగించి టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ఏఐ చిత్రాలను సృష్టించగలిగారు.
అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించి నకిలీ ఉపగ్రహ చిత్రాలను సులభంగా రూపొందించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని పరిశోధకులు, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సున్నితమైన ప్రాంతాలకు సంబంధించిన కల్పిత చిత్రాలను కూడా ఈ టూల్ రూపొందించగలిగిందని వారు పేర్కొన్నారు. దీంతో ప్రజలు నిజమైన ఉపగ్రహ చిత్రాలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో గూగుల్ స్పందిస్తూ గూగుల్ ఎర్త్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడటం తమకు అత్యంత ముఖ్యమని తెలిపింది. ఏఐతో రూపొందించిన చిత్రాలకు సింథ్‌ఐడీ డిజిటల్ వాటర్‌మార్క్ ఉన్నప్పటికీ, మరింత బలమైన భద్రతా చర్యలు అమలు చేసే వరకు ఈ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జెమినీ లేదా గూగుల్ లెన్స్ ద్వారా ఆ చిత్రం ఏఐతో రూపొందించబడిందో లేదో గుర్తించవచ్చని కూడా పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!