

ఆపిల్ తన తదుపరి తరం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 18 ప్రోను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ఫోల్డబుల్ ఐఫోన్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడళ్లను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ప్రో సిరీస్‌లో డిజైన్, పనితీరు, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 18 ప్రోలో డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, సిల్వర్ వంటి కొత్త రంగులను తీసుకురానున్నట్లు సమాచారం. సంప్రదాయ నలుపు రంగును తొలగించే అవకాశం ఉంది. వెనుక డిజైన్, ఫ్లాట్ ఎడ్జెస్‌లో పెద్దగా మార్పులు ఉండకపోయినా, ముందు భాగంలోని డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో A20 ప్రో చిప్‌సెట్ కీలక అప్‌గ్రేడ్‌గా నిలవనుంది. TSMCకి చెందిన 2nm ప్రాసెస్, GAA టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిప్ మునుపటి A19 ప్రో కంటే మెరుగైన పనితీరుతో పాటు తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి.
బ్యాటరీ, కనెక్టివిటీ విషయంలోనూ ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో గణనీయమైన మార్పులు ఉండనున్నాయి. eSIM మోడల్‌లో 5,425mAh, ఫిజికల్ SIM మోడల్‌లో 5,235mAh బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. క్వాల్‌కామ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు ఆపిల్ సొంతంగా రూపొందించిన C2 మోడెమ్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. సెల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించే 5G శాటిలైట్ కనెక్టివిటీపై ఆపిల్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
కెమెరా విభాగంలో వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కాంతి పరిస్థితులకు అనుగుణంగా లెన్స్ ఓపెనింగ్‌ను మార్చుకునే ఈ ఫీచర్ కేవలం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌కే పరిమితం కావచ్చని తెలుస్తోంది. వెనుక మూడు 48MP కెమెరాలు, ముందు 18MP సెంటర్ స్టేజ్ కెమెరా కొనసాగనున్నాయి. LTPO+ డిస్‌ప్లే, సులభమైన కెమెరా కంట్రోల్ బటన్ వంటి మార్పులు కూడా ఉండనున్నాయి. కొత్త ఫీచర్ల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు $1,199, భారత్‌లో సుమారు రూ.1,39,900 ఉండొచ్చని అంచనా. ప్రో మాక్స్ ధర సుమారు రూ.1,54,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!