

దేశంలోని అత్యంత ధనిక వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబం తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2026 గ్రోహే హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 నివేదిక ప్రకారం, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అదానీ ప్రాపర్టీస్ విలువ గత ఏడాదితో పోలిస్తే 72.5 శాతం పెరిగి రూ.90,400 కోట్లకు చేరుకుంది. కంపెనీ విలువ ఒక్క ఏడాదిలోనే రూ.38,000 కోట్లు పెరిగింది.
ప్రణవ్ అదానీ, రాజేశ్ అదానీ నేతృత్వంలో అదానీ ప్రాపర్టీస్ దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ముంబైలోని ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టును కూడా ఈ సంస్థే దక్కించుకుంది. కంపెనీలో 100 శాతం వాటా అదానీ కుటుంబానిదే కావడంతో దేశంలోని అత్యంత సంపన్న రియల్టీ కుటుంబంగా అవతరించింది. అలాగే దేశంలోని అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగో స్థానానికి చేరుకోవడంతో పాటు అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ రియల్టీ కంపెనీగా నిలిచింది.
అయితే అదానీ గ్రూప్ భారీ వృద్ధి సాధించినప్పటికీ, మొత్తం రియల్ ఎస్టేట్ రంగానికి గత ఏడాది అంతగా కలిసిరాలేదు. బీఎస్‌ఈ రియల్టీ సూచీ 20 శాతం క్షీణించగా, టాప్ 150 కంపెనీల మొత్తం విలువ కేవలం 2 శాతం మాత్రమే పెరిగి రూ.16.5 లక్షల కోట్లకు చేరుకుంది. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్ప వృద్ధి అని నివేదిక వెల్లడించింది.
ఇక రూ.1.46 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో డీఎల్‌ఎఫ్ దేశంలో అత్యంత విలువైన రియల్టీ కంపెనీగా కొనసాగుతోంది. అయితే డీఎల్‌ఎఫ్ ప్రమోటర్ రాజీవ్ సింగ్ కుటుంబం రియల్టీ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. లోధా డెవలపర్స్, ఐహెచ్‌సీఎల్, ప్రిజమ్ (ఓయో) టాప్ కంపెనీల్లో చోటు దక్కించుకోగా, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, మై హోమ్, ఎన్‌సీసీ వంటి హైదరాబాద్‌కు చెందిన సంస్థలు కూడా జాబితాలో నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!