

స్పామ్ కాల్స్, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. థర్డ్‌పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే కాలర్ పేరు తెలుసుకునే కాలర్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సదుపాయాన్ని తప్పనిసరి చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సేవను అమల్లోకి తీసుకురావాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం ద్వారా మన ఫోన్లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు, టెలికాం ఆపరేటర్ సబ్‌స్క్రైబర్ డేటాబేస్‌లో నమోదైన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్‌తో పాటు డిస్ప్లేపై కనిపిస్తాయి. దీనివల్ల కాల్ చేస్తున్న వ్యక్తిని ముందుగానే గుర్తించే అవకాశం లభించడంతో పాటు, అవాంఛిత కాల్స్‌ను గుర్తించడంలో వినియోగదారులకు కొంతవరకు ఉపయోగపడనుంది.
ప్రాథమికంగా 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుండగా, 2జీ, 3జీ నెట్‌వర్క్‌లపై అమలుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయ కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి పేరుకు బదులుగా ‘ఇంటర్నేషనల్ కాల్’ అనే సందేశం కనిపిస్తుంది. కాల్ ముగిసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నంబర్‌ను పేరుతో సహా ఆటోమేటిక్‌గా రిట్రీవ్ చేసి సేవ్ చేసుకునే అవకాశం ఉండదు. వినియోగదారులు వివరాలను మాన్యువల్‌గా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (CLIR) సదుపాయాన్ని ఎంచుకున్న చందాదారుల పేర్లు అవతలి వ్యక్తి ఫోన్లో కనిపించవు. ఈ విధానం ద్వారా ప్రత్యేక యాప్‌లపై ఆధారపడకుండా కాలర్ వివరాలను తెలుసుకునే అవకాశం లభించనుంది. అయితే, ఈ సేవ పనితీరు టెలికాం సంస్థల అమలు, సబ్‌స్క్రైబర్ డేటాలోని వివరాల ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!