

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, తాజా అప్‌డేట్లను సభ్యులకు నేరుగా అందించేందుకు అధికారిక వాట్సాప్ చానల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యక్తిగత పీఎఫ్ ఖాతా వివరాలైన బ్యాలెన్స్, క్లెయిమ్ స్థితి వంటి సమాచారాన్ని అందించేందుకు వాట్సాప్ ఆధారిత కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలను కూడా తీసుకొచ్చే ప్రణాళిక ఉంది.
ప్రతిపాదిత వ్యవస్థలో సభ్యులు ఈపీఎఫ్‌ఓ ధ్రువీకరించిన వాట్సాప్ నంబర్‌కు ‘హలో’ అని సందేశం పంపడం ద్వారా సేవలను ప్రారంభించవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత వివిధ సేవల మెనూ అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్, గత ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్థితి, కేవైసీ వివరాలు, వడ్డీ జమ వివరాలు, యూఏఎన్ సంబంధిత ప్రశ్నలు, సాధారణ ఫిర్యాదులు, పెండింగ్ చర్యల వివరాలను అందించేలా చాట్‌బాట్‌ను రూపొందించే ప్రణాళిక ఉంది. ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నారు.
అయితే అధికారిక వాట్సాప్ చానల్ అందుబాటులోకి వచ్చిందని వ్యక్తిగత పీఎఫ్ ఖాతా సేవలన్నీ ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయని భావించకూడదు. ఈపీఎఫ్‌ఓ గతంలోనే ప్రాంతీయ కార్యాలయాల ద్వారా వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలను నిర్వహిస్తోంది. వ్యక్తిగత ఖాతా సేవల కోసం ప్రతిపాదిత కృత్రిమ మేధ చాట్‌బాట్ వేరు. ఈపీఎఫ్‌ఓ పేరుతో వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. యూఏఎన్ పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఈపీఎఫ్‌ఓ హెచ్చరిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!