

లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘ఆర్నబ్’ తుఫాను సృష్టించిన విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఒడిశా పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించడంతో పాటు, వేగంగా పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒడిశా ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత మేర సహాయం అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సహాయక, రక్షణ చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రియాంక గాంధీ సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!