

సావరీన్ గోల్డ్ బాండ్లలో (Sovereign Gold Bonds) పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు అందుతున్నాయి. ముఖ్యంగా 2021లో ఈ బాండ్లను కొనుగోలు చేసిన మదుపర్లు తమ పెట్టుబడిపై దాదాపు 200 శాతానికి పైగా రాబడి పొందే అవకాశం కలిగింది. 2021-22 సిరీస్ VII గోల్డ్ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని నవంబర్ 2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ బాండ్ల రిడెంప్షన్ ధరను ఒక్కో గ్రాముకు రూ.14,167గా నిర్ణయించింది. అప్పట్లో ఆఫ్‌లైన్‌లో గ్రాము బంగారాన్ని రూ.4,765కు, ఆన్‌లైన్‌లో రూ.50 డిస్కౌంట్‌తో రూ.4,715కు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ లెక్కన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గ్రాముపై రూ.9,452 వరకు లాభం వచ్చినట్లవుతుంది. ప్రారంభ పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.
సావరీన్ గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. అయితే ఐదేళ్లు పూర్తయిన తర్వాత మదుపర్లు ముందస్తు ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గడువు ముగియకముందే పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకునే వారి కోసం ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ తేదీలను ప్రకటిస్తుంది. రిడెంప్షన్ ధరను నిర్ణయించేందుకు సంబంధిత తేదీకి ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించిన బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో నమోదైన ధరల ఆధారంగా ప్రస్తుత రిడెంప్షన్ విలువను నిర్ణయించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!