

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా ఆరో రోజు సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచింది. గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయానికి సెన్సెక్స్ 2,024 పాయింట్లు లాభపడి 79,326 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 578 పాయింట్లు పెరిగి 24,538 వద్ద కొనసాగింది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగ సూచీ 2.5 శాతం పెరిగింది. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి.
మార్కెట్ల ర్యాలీకి పలు అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌లో డోజోన్స్ 1,500 పాయింట్లకు పైగా పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.58 శాతం, నాస్‌డాక్ 1.44 శాతం లాభపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 93.5 డాలర్లకు పడిపోయి రెండు నెలల కనిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు బలపడి 94.32 వద్ద కొనసాగింది. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు వరుసగా నాలుగో రోజు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 2025 అక్టోబరు తర్వాత ఒకే రోజులో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!