

బీమా రంగంలో పంపిణీ విధానాన్ని మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వెబ్సైట్లలో కనిపించే మోసపూరిత రూపకల్పన విధానాలైన ‘డార్క్ ప్యాటర్న్స్’ను అరికట్టాలని సూచించింది. బుధవారం విడుదల చేసిన చర్చాపత్రంలో ఈ ప్రతిపాదనలను వివరించింది. ప్రస్తుతం కొన్ని వెబ్సైట్లలో పాలసీ వివరాలు, ధరలు, ప్రీమియం తెలుసుకోవడానికి ముందుగా వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వస్తోంది. ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈ ఇబ్బంది తొలగి, వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందించకుండానే పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు.
బీమా పంపిణీలో అయ్యే ఖర్చులు, కమీషన్లు, మార్కెటింగ్ విధానాలపై స్పష్టత తీసుకురావడం కూడా ఈ సంస్కరణల లక్ష్యంగా ఉంది. పంపిణీ సంస్థలను మూడు విభాగాలుగా వర్గీకరించాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. అవి ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంటిటీస్ (ఐడీఈలు), ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ పర్సన్స్ (ఐడీపీలు), మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ (ఎంఐఐలు). కమీషన్ల విధానం, వివరాల వెల్లడింపు, వినియోగదారుల రక్షణ, తప్పుడు విక్రయాలను అరికట్టే చర్యలపైనా చర్చాపత్రంలో ప్రతిపాదనలు ఉన్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!