

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఎక్స్‌పో జరగనుంది. ప్రపంచ ఆటోమొబైల్, మొబిలిటీ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,750 మందికి పైగా ఎగ్జిబిటర్లు హాజరవుతారని అంచనా. ఆటోమొబైల్ తయారీ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, మొబిలిటీ సొల్యూషన్ ప్రొవైడర్లు తమ తాజా ఉత్పత్తులు, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించేందుకు ఈ ఎక్స్‌పో అంతర్జాతీయ వేదికగా నిలవనుంది. ‘స్మార్టర్ మొబిలిటీ ఫర్ ఏ బెటర్ టుమారో’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్మార్ట్, సుస్థిర రవాణా వ్యవస్థల ప్రాధాన్యతను ఈ ఎక్స్‌పో ప్రధానంగా చాటిచెప్పనుంది.
ఆటో షోలో భాగంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. వివిధ దేశాలకు చెందిన కంపెనీల మధ్య వ్యాపార అవకాశాలు, సహకారాలు పెంపొందించేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడనుంది. భవిష్యత్తు రవాణా రంగంలో వస్తున్న మార్పులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థలు ఈ వేదికపై ప్రదర్శించనున్నాయి. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో భారత్ మొబిలిటీ ఎక్స్‌పో దేశ ఆటోమొబైల్ రంగానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!