

వ్యయ నియంత్రణలో భాగంగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ భారత విభాగంలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఆధారంగా వెలువడిన వివరాల ప్రకారం.. టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను బ్యాచ్‌ల వారీగా విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. తొలగింపులకు గురైన వారిలో డైరెక్టర్ స్థాయి అధికారులు, ప్రధాన కార్యాలయ టీమ్ లీడర్లు, బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కొందరికి నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడం, ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ తగ్గడం, ముడిసరుకు వ్యయాలు పెరగడం వంటి కారణాలతో శామ్‌సంగ్ లాభదాయకతపై ఒత్తిడి నెలకొంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా ఏడాది ప్రాతిపదికన 11 నుంచి 12 శాతం మేర క్షీణించినట్లు సమాచారం. పరిశ్రమ వర్గాల ప్రకారం రాబోయే రోజుల్లో సేల్స్, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మొత్తం సిబ్బందిలో 25 శాతం వరకు కోత ఉండొచ్చు. అయితే ప్రస్తుత లేఆఫ్స్‌లో స్మార్ట్‌ఫోన్ విభాగం ప్రభావితం కాలేదని, దీపావళి సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందని శామ్‌సంగ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. శాఖల ఏకీకరణతో పాటు భారత కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!