

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కీలక మార్పు కనిపిస్తోంది. పెట్రోల్ కార్లకు బదులుగా సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, ఆగస్టు 2026లో సీఎన్‌జీ, హైబ్రిడ్, ఈవీలు కలిపి రిటైల్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 42 శాతం వాటా సాధించగా, పెట్రోల్ వాహనాల వాటా 41 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 46 శాతంగా ఉన్న పెట్రోల్ వాటా రికార్డు కనిష్ఠానికి చేరింది. సీఎన్‌జీ వాహనాల వాటా 21 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో మారుతీ సుజుకీ 71 శాతం వాటాతో ముందుండగా, టాటా మోటార్స్ 17 శాతం, హ్యుందాయ్ 9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కొనుగోలు శక్తి పెరగడంతో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 16 శాతం వృద్ధితో సుమారు 4.01 లక్షల యూనిట్లకు చేరాయి.
ఈవీల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఏడాది కిందటితో పోలిస్తే ఆగస్టులో ఈవీ విక్రయాలు 52 శాతం పెరిగి 30,700 యూనిట్లకు చేరాయి. ఈవీల మార్కెట్ వాటా 5.9 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. అయితే జూలైలో నమోదైన 8.1 శాతం రికార్డుతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ. టాటా మోటార్స్ 43 శాతం వాటాతో ఈవీ విభాగంలో ఆధిపత్యం కొనసాగించగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వాటా 28 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ఈ20 ఇథనాల్ మిశ్రమంపై వినియోగదారుల్లో ఉన్న సందేహాలు ఈ మార్పుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు పెరుగుతున్న ఆదరణ భారత ఆటో మార్కెట్‌లో కొత్త ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!