

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) యువతకు మరింత చేరువ కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. యువత బ్యాంకు శాఖలకు వచ్చే వరకు వేచి ఉండకుండా, బ్యాంకులే నేరుగా వారి వద్దకు వెళ్లాలని చెప్పారు. 16 ఏళ్లు పైబడిన యువతను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 2 నుంచి నెల రోజుల పాటు ‘బ్యాంకింగ్ ఫర్ యూత్’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఖాతా ప్రారంభం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు బ్యాంకింగ్ సేవలపై యువతకు అవగాహన కల్పించాలని అన్నారు.
కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా క్యాంపస్‌లను ఈ ప్రచారానికి ప్రధాన వేదికలుగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. యువతను ఆకర్షించేందుకు 12 పీఎస్‌బీలు తమకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకోవాలని చెప్పారు. యువత కేవలం ఖాతా తెరవడం వరకే పరిమితం కాకుండా, ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపారం, పెట్టుబడులు వంటి జీవితంలోని వివిధ దశల్లో తమ బ్యాంకుతో దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగించేలా సేవలు అందించాలని సూచించారు.
యువతకు ఉచిత ఆన్‌లైన్ విద్యా కంటెంట్‌ను అందించడంతో పాటు, ఫిట్‌నెస్, యోగా వంటి లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు, కూపన్లు, వోచర్లను అందించే అవకాశాలను పరిశీలించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు శాఖల్లో యువ బ్యాంకింగ్ మిత్రలు, యువ కియోస్క్‌లను ఏర్పాటు చేసి రుణాలు, ప్రభుత్వ పథకాలు, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. యువతకు అనువైన బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అవకాశాలపై సమాచారం అందించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!