

దేశంలో ఎల్‌పీజీ సరఫరా మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల పెట్టుబడితో సుమారు 1,800 కిలోమీటర్ల మేర మూడు కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులకు పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానించనున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఈ మూడు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. ఇవి పూర్తయిన తర్వాత దేశంలోని కామన్ క్యారియర్ ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ప్రస్తుత 7,700 కిలోమీటర్ల నుంచి సుమారు 9,500 కిలోమీటర్లకు పెరగనుంది. అంటే నెట్‌వర్క్‌లో దాదాపు 23.5 శాతం వృద్ధి నమోదవుతుంది. దీంతో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం కావడంతో పాటు రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గనుంది.
కొత్తగా ఆమోదం పొందిన మూడు ప్రాజెక్టుల్లో తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు 556 కిలోమీటర్ల పైప్‌లైన్ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు 611 కిలోమీటర్ల పైప్‌లైన్ రెండోది. మహారాష్ట్రలోని షిక్రాపూర్ నుంచి గోవా మీదుగా కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్ల పైప్‌లైన్ మూడోది.
ఇప్పటికే దేశంలోనే అత్యంత పొడవైన 2,757 కిలోమీటర్ల కాండ్లా-గోరఖ్‌పూర్ ఎల్‌పీజీ పైప్‌లైన్‌కు ఆమోదం లభించింది. కొత్త ప్రాజెక్టులు కూడా పూర్తయితే దేశంలోని కీలక ప్రాంతాలకు ఎల్‌పీజీ రవాణా మరింత వేగంగా, సురక్షితంగా మరియు సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!