

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా వారి క్రమశిక్షణా రికార్డుల్లో ఒక్కొక్క డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో ఫెర్నాండో బౌలింగ్‌లో యశస్వి ఔటయ్యాడు. లంక ఆటగాళ్లు వికెట్ సంబరాలు చేసుకుంటుండగా.. డగౌట్ వైపు వెళ్తున్న యశస్వితో ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం ఇద్దరూ ఒకరిమీదకు మరొకరు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యశస్వి హెల్మెట్ ఫెర్నాండో నుదిటిని తాకడంతో సహచరులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటనపై ఇద్దరూ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే శిక్షను అంగీకరించారు. గత 24 నెలల్లో ఇద్దరికీ ఎలాంటి క్రమశిక్షణా ఉల్లంఘనలు లేకపోవడంతో ఈ ఘటనను తొలి తప్పిదంగా పరిగణించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!