

బల్గేరియాలో దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే ప్రాంతంలో రహదారికి ఇరువైపులా ప్రయాణిస్తున్న 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దేశ రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రహదారిపై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాంబోల్ సమీపంలో పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఎక్కువగా ట్రక్కులే ఉన్నట్లు సమాచారం.
ప్రమాద స్థలంలోనే 10 మంది మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మంత్రి కాట్యా ఇవ్కోవా వెల్లడించారు. మరో 46 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రధాని రుమెన్ రాదేవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఇంత భయానక దృశ్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని ప్రాంతీయ గవర్నర్ మిహైల్ కాషెరోవ్ పేర్కొన్నారు. దట్టమైన పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడం, రహదారి తడిగా ఉండటం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!