

రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆహార భద్రతా శాఖ అధికారులు బిహారీపురాలోని ఓ గిడ్డంగిపై దాడి చేసి దాదాపు 10 క్వింటాళ్లు అంటే 1,000 కిలోల తయారైన ఛేనా రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి తయారీలో కల్తీ పనీర్, చక్కెరతో పాటు ‘సెఫోలైట్’ వంటి రసాయనాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. స్వాధీనం చేసుకున్న మిఠాయిలను నిబంధనల ప్రకారం పారవేసే చర్యలు చేపట్టారు. గిడ్డంగి నిర్వాహకుడి లైసెన్సును రద్దు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు, ఘజియాబాద్‌లో ఆగస్టు 14న నిర్వహించిన తనిఖీల్లో 868 కిలోల పనీర్, 170 కిలోల కోవాను అధికారులు ధ్వంసం చేశారు. పండుగల సమయంలో కల్తీ ఆహార పదార్థాలపై దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోనూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు ఆహార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాడైపోయిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. లైసెన్సులు లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపైనా చర్యలు తీసుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!