

భారత్‌లో కోట్లాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడం ప్రయాణికులకు చాలాకాలం ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారంగా బెంగళూరుకు చెందిన సిగ్మాయిడ్ ల్యాబ్స్ సంస్థ ‘వేర్ ఈజ్ మై ట్రైన్’ అనే యాప్‌ను రూపొందించింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటర్నెట్, జీపీఎస్ లేకపోయినా రైలు ప్రయాణ సమయంలో సెల్ టవర్ సమాచారాన్ని ఉపయోగించి రైలు స్థానాన్ని గుర్తించే విధంగా యాప్‌ను అభివృద్ధి చేశారు. ఆఫ్‌లైన్‌లో రైలు సమయ పట్టికలు కూడా అందుబాటులో ఉండటంతో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
సరళమైన రూపకల్పన, తక్కువ డేటా వినియోగం, ఇంటర్నెట్ లేకుండానే రైలు స్థితిని తెలుసుకునే సౌకర్యం వంటి ప్రత్యేకతలతో ‘వేర్ ఈజ్ మై ట్రైన్’ వేగంగా ప్రజాదరణ పొందింది. 2018లో ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన సిగ్మాయిడ్ ల్యాబ్స్‌ను గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. ఒప్పంద విలువను అధికారికంగా వెల్లడించకపోయినా, అప్పటి నివేదికల్లో సుమారు 3 నుంచి 4 కోట్ల అమెరికన్ డాలర్లుగా అంచనాలు వెలువడ్డాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యకు స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికతతో పరిష్కారం చూపితే ప్రపంచ స్థాయి సంస్థల దృష్టిని ఆకర్షించవచ్చని ఈ భారతీయ అంకుర సంస్థ విజయగాథ నిరూపించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!