

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని మరింత పెంచినట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏఐ ఆధారిత రద్దీ విశ్లేషణ ద్వారా భక్తుల రాకపోకలను అంచనా వేయడం, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించడం, అవసరమైన చోట్ల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కొండపై, ఘాట్రోడ్లు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు, బూమ్ బ్యారియర్లను వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర పరిస్థితులపై సమన్వయంతో స్పందించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని, అనుమతి లేని మార్గాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కూడా ముఖ్యమని డీజీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శీనా నాయక్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఆయన వెంట ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!