

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం అలిపిరి నడకమార్గంలో వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో ఈ మార్గంలో చిరుతల దాడులు జరగడం, ఇటీవల వన్యప్రాణుల సంచారం పెరగడంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. వన్యప్రాణుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడో మైలు వద్దనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీటీడీ, అటవీ, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యశాఖల సమన్వయంతో ఈ బృందాలు పనిచేయనున్నాయి.
ఈ భద్రతా వ్యవస్థలో ఏఐ ఆధారిత రోబోట్‌ను వినియోగించనున్నారు. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు వంటి అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను ఏఐ ద్వారా గుర్తించి వర్గీకరించడంతో పాటు జియో-ట్యాగ్‌డ్ అలర్ట్‌లు, లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి పంపుతుంది. వన్యప్రాణులు భక్తుల వైపు వస్తే సౌండ్, లైట్ యూనిట్లతో ఎలాంటి భౌతిక తాకిడి లేకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!