

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వ ప్రణాళికను అన్ని రాజకీయ పార్టీలతో పంచుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543కే మరో 25 సంవత్సరాల పాటు పరిమితం చేయాలని, రాష్ట్రాలవారీగా స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆయన సూచించారు. అలాగే 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే విజ్ఞప్తి చేశారు.
డీలిమిటేషన్ బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ప్రస్తావించిన ఖర్గే, ప్రభుత్వం తన ప్రతిపాదనలను ముందుగానే అందరి ముందు ఉంచాలని కోరారు. ఈ కీలక అంశంపై అధ్యయనం చేసి స్పందించేందుకు రాజకీయ పార్టీలకు, రాష్ట్రాలకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన దేశ భవిష్యత్తుతో ముడిపడిన ముఖ్యమైన అంశమని, దీనిపై ఏకపక్షంగా లేదా బలవంతంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!