

తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రోన్ల సాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించాలని సూచించారు. సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని స్పష్టం చేశారు.
శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయడంతో పాటు మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో హనుమాన్ బృందాలను మోహరించి, క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంట నష్టంపై నివేదికలు అందిన వెంటనే అటవీశాఖ ద్వారా బాధితులకు తక్షణ పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!