

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కీలక గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 44,89,488 మంది, అంటే 10.78 శాతం పేర్లను ముసాయిదా జాబితా నుంచి మినహాయించాల్సిన కేటగిరీలో గుర్తించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిలో 15.22 లక్షల మంది మృతులు, 14.43 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు శాశ్వతంగా తరలిపోయినవారు, 7.37 లక్షల మంది రెండుచోట్ల పేర్లు నమోదు చేసుకున్నవారు, మరో 7.77 లక్షల మంది ఆచూకీ లభించనివారు లేదా నమోదిత చిరునామాల్లో నివసించనివారు ఉన్నారు. జూన్ 15 నుంచి జులై 24 వరకు నిర్వహించిన ప్రక్రియలో 3,71,38,206 మంది (89.22%) ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు అందించారు. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో గుర్తించిన 44.89 లక్షల పేర్లు ఉండవు.
అయితే ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోవడంపై అభ్యంతరాలు ఉంటే జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. విచారణలో అర్హత నిర్ధారణ అయితే ఓటును పునరుద్ధరిస్తారు. మరోవైపు ఎన్యూమరేషన్ పత్రాల్లో లోపాలతో వివరాలు సమర్పించిన 36,68,979 మంది పేర్లు ముసాయిదా జాబితాలో కొనసాగుతాయి. వీరిలో 7,56,695 మంది ‘నో మ్యాపింగ్’ కేటగిరీలో ఉన్నారు. వీరు ఎన్నికల సంఘం సూచించిన వివరాలు లేదా నిర్దేశిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలవారీగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 6.96% మృతుల ఓట్లు గుర్తించగా, తిరుపతిలో 7.05% శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లు, నెల్లూరులో 2.91% డబుల్ ఎంట్రీలు, కడపలో 4.19% ఆచూకీ లభించని లేదా చిరునామాల్లో లేని ఓట్లు నమోదయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!