

ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరు కావడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయనకు బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ గురువారం వెల్లడించారు. దీంతో తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయనకు బంగ్లాదేశ్ ప్రధాని హోదాలో కాకుండా బిమ్‌స్టెక్ చైర్మన్‌గా ఆహ్వానం అందిందని హుమాయున్ తెలిపారు. అయితే అధికారిక ఆహ్వానం లేనప్పుడు భారత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తారిక్ రెహ్మాన్ తొలి భారత్ పర్యటన బహుళ దేశాల కార్యక్రమానికి పరిమితం కాకుండా, సరైన సమయంలో పరస్పర గౌరవంతో కూడిన వాతావరణంలో ద్వైపాక్షిక పర్యటనగా ఉండాలని హుమాయున్ పేర్కొన్నారు. ఆయన భారత్ పర్యటనకు తొందరేమీ లేదన్నారు. ఇదిలా ఉంటే, బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, భద్రత, అనుసంధాన రంగాల్లో సహకారం కోసం బిమ్‌స్టెక్ ఏర్పడింది. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఈ కూటమికి చైర్మన్‌గా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!