

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వినియోగదారుల పరిరక్షణ (ఈ కామర్స్ సవరణ) నిబంధనలు, 2026’ను ప్రకటించింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం డిస్కౌంట్ ధరలను ప్రకటించే సమయంలో గత 30 రోజుల్లో విక్రయించిన అత్యల్ప ధరను అసలు ధరగా చూపించాలి. అలాగే సెర్చ్ ఫలితాలను కావాలనే మార్చడం లేదా ర్యాంకింగ్‌ను ప్రభావితం చేయడం నిషేధం. చెల్లింపు ఆధారంగా చూపించే ఉత్పత్తులను ‘స్పాన్సర్డ్’గా స్పష్టంగా పేర్కొనాలి.
వినియోగదారులను తప్పుదోవ పట్టించే డిజిటల్ ట్రిక్స్ అయిన ‘డార్క్ ప్యాటర్న్స్’పై కూడా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ కామర్స్ సంస్థలు ప్రతి సంవత్సరం స్వీయ తనిఖీ నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని తమ వేదికపై ప్రదర్శించాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విషయంలో ఉత్పత్తి తయారైన దేశం, దిగుమతిదారుడి వివరాలను స్పష్టంగా చూపించాలి. దీంతో వినియోగదారులు ఉత్పత్తి మూలం, విక్రేత వివరాలను కొనుగోలుకు ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు వినియోగదారులకు ఉత్పత్తి గురించి పూర్తి సమాచారం అందించడం కూడా తప్పనిసరి చేశారు. ఉత్పత్తి గడువు, ఉపయోగించాల్సిన తేదీ, రిటర్న్, రీఫండ్ విధానాలు, వారంటీ, డెలివరీ, చెల్లింపు వివరాలను స్పష్టంగా అందించాలి. వినియోగదారుల అనుమతి లేకుండా అదనపు లేదా సంబంధం లేని సేవల రుసుములను కొనుగోలుకు జత చేయడాన్ని నిషేధించారు. ముందుగానే ఎంపిక చేసి ఉంచే చెక్‌బాక్స్‌ల ద్వారా అదనపు సేవలను వినియోగదారులపై బలవంతంగా రుద్దకూడదు.
అలాగే వినియోగదారుల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి ఈ కామర్స్ సంస్థ జాతీయ వినియోగదారుల సహాయవాణి నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కావడం తప్పనిసరి చేశారు. మొత్తంగా డిస్కౌంట్ ధరలు, సెర్చ్ ఫలితాలు, స్పాన్సర్డ్ ఉత్పత్తులు, డార్క్ ప్యాటర్న్స్, దిగుమతి వివరాలు, ఉత్పత్తి సమాచారం, అదనపు రుసుముల విషయంలో కొత్త నిబంధనలు వినియోగదారులకు మరింత రక్షణ కల్పించనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!