

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సదస్సు జరగనుండగా, ఇందులో భాగంగా నిర్వహించే రక్ష ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని ఆయన కోరారు. ఢిల్లీలో జరిగిన భేటీలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు, ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శనలు, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రదర్శనల నిర్వహణపై చర్చించారు. ఎక్స్‌పో విజయవంతానికి రక్షణ శాఖ సహకరించాలని, భారత వైమానిక దళం, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల భాగస్వామ్యంతో పాటు రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలల భాగస్వామ్యాన్ని కోరారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించినట్లు సీఎం తెలిపారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా మరో 750 ఎకరాల భూసేకరణకు కూడా అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్‌డీఎల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ అంగీకరించిందని వెల్లడించారు. మొత్తం భూమిని సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజుతో 33 సంవత్సరాల కాలానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అవసరమైతే లీజును మరో రెండుసార్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!