

సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి దిల్లీ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆగస్టు 31న విమానం ప్రయాణిస్తుండగా మరుగుదొడ్డిలో బాంబు బెదిరింపు ఉన్న టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో భద్రతా ప్రోటోకాల్స్‌లో భాగంగా విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని విమానం నుంచి దించి, ప్రత్యేక ప్రాంతానికి తరలించి తనిఖీలు చేపట్టారు.
విమానంతో పాటు ప్రయాణికుల సామగ్రి, కార్గో తదితర ప్రాంతాలను సీఐఎస్‌ఎఫ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు నోట్ ఎవరు రాశారో గుర్తించేందుకు విమానంలో ఉన్నవారి చేతిరాత నమూనాలను అధికారులు సేకరించారు. చేతిరాత పరిశీలన అనంతరం ఓ సిబ్బందిపై అనుమానం వ్యక్తమవగా, మరో ప్రయాణికుడి పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఎవరు ఉన్నారు, ఇది నకిలీ బెదిరింపా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!