

మాషా అల్లా స్క్రబ్బర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అంకుశం రాజా, అతని భార్య సుమ తొలి రోజు పోలీసు విచారణలో నోరు విప్పలేదని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు ఇద్దరూ సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా తమకు ఏమీ తెలియదంటూ రాజా సమాధానం ఇచ్చినప్పటికీ, చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానంగా మారినట్లు సమాచారం. సిట్ దర్యాప్తులో సేకరించిన వివరాలను వారి ముందు ఉంచి ప్రశ్నలు సంధించినా ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడంతో తొలి రోజు విచారణ అరకొరగానే ముగిసింది.
రూ.కోట్ల మోసం కేసులో నిందితులైన దంపతులను సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకునేందుకు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు అనుమతించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వారిని పోలీసులు తొలుత ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి, అనంతరం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నార్త్ ఏసీపీ సత్యానందం పర్యవేక్షణలో వారిని విడివిడిగా విచారించారు. మోసం ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు, ఆ డబ్బును ఏం చేశారు, నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఉంది, మరెవరైనా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా అనే అంశాలపై ప్రశ్నించారు. అయితే సరైన సమాధానాలు రాకపోవడంతో మిగిలిన నాలుగు రోజుల కస్టడీలో మరింత లోతుగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. కేసులో మరికొందరి పాత్రపై పోలీసులకు సమాచారం ఉండటంతో తదుపరి విచారణలో వారి నుంచి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!